ఇకనైనా తెలంగాణ భవన్ కు హౌస్ ఫుల్ బోర్డు పెడతారా?

తెలంగాణ రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అనేక మంది నాయకులతో కళకళలాడుతుంది. ఒకప్పుడు నాయకుల కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు తెలంగాణలో అత్యంత బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది అనడంలో సందేహం లేదు. ప్రత్యర్థి పార్టీల నుండి నాయకులను ఒక్కొక్కరుగా చేర్చుకుంటూ ప్రత్యర్థి పార్టీలను దాదాపు నిర్వీర్యం చేసింది. ఇప్పుడు తాజాగా వివేక్, వినోద్, గుత్తా వంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెరాసలో చేరారు. అయితే ఈ రాజకీయ వలసలు ఇకనైనా ఆగుతాయా అంటే చెప్పలేని పరిస్థితి. పై స్థాయిలో ఎలా ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలతో ముందునుండి తెరాసలో ఉన్న నేతలు కలువలేక పోతున్నారు. ఈ విభేదాలు ఎక్కువగా వేరే పార్టీ ఎమెల్యేలు తెరాసలో చేరిన నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయి. తెరాస అధి నాయకత్వం మాత్రం దీనిపై దృష్టి పెట్టినట్లు కనపడడం లేదు. అలాగే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను సంపాదించి, ఎన్నికల్లో వేరే పార్టీల తరపున ఓటమి పాలైన నేతలు సైతం ఇప్పుడు తెరాసలో చేరుతున్నారు. వారి వల్ల పార్టీకి అదనపు బరువు తప్ప పెద్దగా ఉపయోగం లేదు.  ఇప్పటికైనా తెరాస అధి నాయకత్వం వలసలపై కాకుండా క్షేత్ర స్థాయిలో పార్టీలో ఉన్న విభేదాలపై దృష్టి పెడితే బాగుంటుంది.

Leave a Reply