పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు..

తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా ఆత్మకూర్ మండలం నందిమల్లలో రామన్ పాడ్ ప్రారంభించిన హరీష్ రావు, అనంతరం ధరూర్ మండలం రేలంపాడులో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం రెండవ లిఫ్టును ప్రారంభించారు. తరువాత  కొత్తకోటలో భీమా ఎత్తిపోతల పథకం స్టేజ్ 2 పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కొయిల్ సాగర్ ఎత్తిపోతాల పథకం మొదటి లిఫ్టును నర్వ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో, రెండవ లిఫ్టును ధన్వాడ మండలం సీలేరు గ్రామంలో ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి హరీష్ రావు ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ఈ రోజు తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అని, మహబూబ్ నగర్ జిల్లా చరిత్రను తిరగ రాసి, ఒక కొత్త చరిత్రను సృష్టించుకున్న రోజు అని పేర్కొన్నారు. ఒక వైపు కృష్ణా నది, మరో వైపు తుంగభద్ర నది పారుతున్నా, 60 ఏండ్లుగా మహబూబ్ నగర్ ప్రజలకు అన్యాయమే జరిగిందని, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, పదవులు అనుభవించారు అని, ప్రజలకు మాత్రం కష్టాలనే మిగిల్చారని అన్నారు. కాని రెండు సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి  కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తాము మొదలు పెట్టిన పనులనే టీఆర్ఎస్ నేతలు ప్రారంభిస్తున్నారని విమర్శిస్తున్నారని, అయితే ఆ పనులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ప్రజలకు నీళ్ళు వస్తుంటే, ప్రతిపక్షాలకు కన్నీళ్ళు వస్తున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. అభివృద్ధి ఫలాలు మొదట మహబూబ్ నగర్ జిల్లాకే అందాలని ముఖ్యమంత్రి అనుక్షణం తాపత్రయ పడుతున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు.

Leave a Reply