కెసిఆర్ పై హై కోర్ట్ మాజీ న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కెసిఆర్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అయితే ఈ రెండేళ్లలో కెసిఆర్ పాలనపై పెద్దగా విమర్శలు రాలేదు. ప్రతి పక్షాలు మాత్రం అప్పుడప్పుడు ఆయనను విమర్శించాయి. అయితే రెండేళ్ళ పాలన పూర్తయిన తర్వాత మెల్లగా ఆయనపై విమర్శల జడివాన కురుస్తుంది. ఇప్పుడు ఆయనను ప్రతిపక్షాల కన్నా మేధావులు,ఉద్యమకారులు విమర్శించడం చర్చనీయాంశం అవుతుంది. కెసిఆర్ పాలనపై ముందుగా ప్రొఫెసర్ కొదందారం తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇప్పుడు తాజాగా హై కోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడుకుందాం-తెలంగాణను రక్షించుకుందాం అనే సదస్సులో ప్రసంగించిన చంద్రయ్య రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాటిని ఆత్మహత్యలు కావని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని, 34 వేల కోట్ల ప్రాజెక్టులను ఇంజనీర్లు వద్దని చెప్పినా, వాటిని 80 వేల కోట్లకు పెంచి కడుతున్నారు అని ఆరోపించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామన్నారని, రైతులకు రుణ మాఫీ అన్నారని, దళిత గిరిజనులకు ముడేకరాల భూమి ఇస్తాను అన్నారు అని, ఇవన్ని గోబెల్స్ ను మించిన అబద్దాలు అని విమర్శించారు. ఇలా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారని కెసిఆర్ ను చంద్రయ్య ప్రశ్నించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర తెలంగాణ ప్రజలది అని, ప్రజలు తలచుకుంటే ప్రత్యామ్నాయాన్ని చూపిస్తారు అని కెసిఆర్ ను హెచ్చరించారు.

Leave a Reply