ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు..!

టీజేఏసీ చైర్మన్ ప్రో. కోదండరాం మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజలు, నిపుణుల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ప్రాజెక్టులు డిజైన్ చేస్తుందని ఆరోపించారు. గురువారం హైదరాబాద్ లో జరిగిన జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశాలను మీడీయాకు వివరించిన కోదండరాం, తమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ఎలాగైతే ముంపును తగ్గించారో అలాగే, మల్లన్న సాగర్ ఎత్తు కూడా తగ్గించి ముంపును తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో నిరుద్యోగ సమస్యను చర్చించామని, ఆగష్టు మొదటి వారంలో హైదరాబాద్ లో నిరుద్యోగ సమస్యపై సదస్సు నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు. అలాగే ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకం, జెన్ కో చేపట్టే భూసేకరణపై కూడా సమావేశంలో చర్చించామని కోదండరాం తెలిపారు. గడచిన రెండేళ్లలో రాష్ట్రంలో జరిగిన విద్యుత్ వినియోగం, రాష్ట్రంలోని సమస్యలపై జేఏసీ అధ్వర్యంలో పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. జూలై 21,22 తేదిలో పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులను జేఏసీ అధ్వర్యంలో సందర్శించబోతున్నట్లు కోదండరాం తెలిపారు.

Leave a Reply