కెసిఆర్ పై కోదండరాం విమర్శలు అందుకోసమేనా..?

గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న టిజేఎసి చైర్మన్ కొదండరాం ఒక్కసారిగా మళ్ళి వార్తల్లోకి వచ్చారు. అందుకు కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను తీవ్రంగా విమర్శించడమే. కోదండరాం ఎంత తీవ్రంగా విమర్శించాడంటే, ముఖ్యమంత్రి కెసిఆర్ కు పరిపాలన చేతకావడం లేదని ఆయన తప్పుకుంటే తాము పరిపాలిస్తామని తీవ్రంగా వ్యాఖ్యానించాడు. దీనిపై రాజకీయ విశ్లేషకులు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు. కొంతమంది కోదండరాంకి అధికార కాంక్ష మొదలైందని అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని అంటుండగా, మరికొందరేమో ఆయనను కెసిఆర్ సరిగా ఆదరించనందుకే ఇలా మాట్లాడుతున్నాడని, కెసిఆర్ పాలనను కోదండరాం సరిగ్గా అంచనా వేయనందుకే ఇలా వ్యాఖ్యానించి ఉండొచ్చని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ పనితీరును అంచనావేయడానికి ఈ సమయం ఏ మాత్రం సరిపోదు, అటువంటప్పుడు కోదండరాం ఇలా వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా నిర్వీర్యం అవుతున్నాయి. తెలంగాణలో రాజకీయ శూన్యత దాపురించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వస్తే తనకు తప్పకుండా ఆదరణ ఉంటుందని కోదండరాం భావిస్తుండవచ్చు.

Leave a Reply