మరోసారి దీక్షకు సిద్దం అవుతున్న కేసీఆర్…

తెలంగాణలో హై కోర్ట్ విభజన పెద్ద దుమారాన్నే రేపుతుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉన్న హై కోర్టును తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి కోర్ట్ గా కేంద్రం కేటాయించింది. దీనిపై తెలంగాణ వాదులు ఎప్పట్నుంచో తమ నిరసనను తెలియజేస్తున్నారు. అందుకు కారణం ఉమ్మడి రాష్ట్రంలో హై కోర్ట్ లో ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయవాదులు, జడ్జిలే తిష్ట వేశారన్నది తెలంగాణ వాదుల ఆరోపణ. హై కోర్ట్ విభజన జరిపితే తమ ప్రాంత న్యాయవాదులకు, జడ్జిలకు అవకాశం లభిస్తుంది అనేది తెలంగాణ వాదుల అభిప్రాయం. అయితే రాజ్యాంగం ప్రకారం ప్రతి రాష్ట్రానికి హై కోర్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఆ నిబంధనే ఇప్పుడు తెలంగాణ వాదులకు ప్రతిబంధకంగా మారింది. హై కోర్ట్ విభజన అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కాని కేంద్రం నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా తెలంగాణలోని అన్ని కోర్ట్ ల  జడ్జిలు రాజీనామా చేసి తమ నిరసనను తెలియజేశారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా న్యాయ వాదులకు పూర్తి మద్దతు ఇస్తుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా మంత్రులు అందరూ తెలంగాణకు ప్రత్యేక హై కోర్ట్ కోసం దీక్షకు దిగడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. గతంలో ఏ విధంగా అయితే కెసిఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేసి తెలంగాణ సాధించారో ఇప్పుడు కూడా అదే విధంగా తెలంగాణకు ప్రత్యేక హై కోర్ట్ సాధిస్తారని తెలంగాణ వాదులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply