కేంద్రంలో చలనం తీసుకు వస్తాం..

తెలంగాణలో హై కోర్టు విభజన పెద్ద దుమారాన్ని రేపుతుంది. న్యాయవాదులకు రాజకీయ ప్రతినిధులు మద్దతు ఇస్తుండడంతో ఈ అంశం రాజకీయంగా కూడా సెగలు పుట్టిస్తుంది. నిజామాబాద్ ఎంపి కవిత ఈ విషయంపై స్పందిస్తూ తెలంగాణలో హై కోర్ట్ ఏర్పాటును ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వన్ని కవిత ప్రశ్నించారు. హై కోర్టులో కేవలం ముగ్గురు మాత్రమే తెలంగాణ జడ్జీలు ఉన్నారని, తెలంగాణలోని న్యాయ వ్యవస్థను మొత్తం ఆంధ్రా జడ్జీలతో నింపి వేస్తున్నారు అని కవిత ఆరోపించారు. ఆంధ్రాలో పని చేస్తున్న జడ్జీలు కూడా కుట్రపూరితంగా తెలంగాణకు ఆప్షన్లు ఇస్తున్నారని, తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఆంధ్ర జడ్జీలను కొనసాగించడం రాజ్యంగా స్పూర్తికే విరుద్ధం అని కవిత అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరినా స్పందించలేదని ఎందుకు అంత నిర్లక్ష్యం అని ఆమె ప్రశ్నించారు.  తెలంగాణ బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని సూచించారు. తెలంగాణ జడ్జీలకు జరుగుతున్న అన్యాయంపై ఎంపిలము అంతా పార్లమెంట్ లో గళమెత్తుతామని, కేంద్రంలో చలనం తీసుకు రావడానికి అవసరమైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తామని కవిత పేర్కొన్నారు.

Leave a Reply