ఎడిటోరియల్: కాంగ్రెస్ కు టిడిపి గతే పడుతుందా..?

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు అన్ని అధికార తెరాస దెబ్బకు కుదేలు అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం అయితే ఏకంగా తెరాసలో విలీనం అయ్యింది. ఇప్పుడు మరో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వంతు వచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున  21 శాసనసభ్యులు ఎన్నికైతే ఇప్పుడు కేవలం 13 మంది మాత్రమే మిగిలారు. మరో ఇద్దరు గనుక తెరాసలో చేరితే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా పోతుంది. శాసన సభ్యులతో పాటు మరి కొంత మంది కీలక కాంగ్రెస్ నేతలు కూడా తెరాసలోకి వలస వెళ్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైన వివేక్,వినోద్ లతో పాటు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. వారు తెరాసలో చేరడం ఇక లాంఛనమే. అయితే ఇంత జరుగుతున్నా ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ దీనిపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీని ఎలా బలోపేతం చెయ్యాలి అని ఆలోచించకుండా గ్రూపు తగాదాలతో వారికి వారే నష్టం చేకుర్చుకుంటూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి ప్రజల్లో కొంత సానుభూతి ఉంది, మిగిలిన పార్టీలతో పోలిస్తే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది కాని వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఆ పార్టీ నాయకులకు అంతుబట్టడం లేదు. పార్టీలో ఎవరికీ వారు తామే ముఖ్యమంత్రి అభ్యర్థులు అని భావించి, మిగతా నాయకులతో సఖ్యతగా ఉండడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీకి, పార్టీలోని నాయకులను సమర్థవంతంగా నడిపించే, ప్రజాకర్షక నాయకత్వం కావాలి. కాని అందుకు కాంగ్రెస్ అధిష్టానం సహకరిస్తుందా అంటే అనుమానమే. ఎందుకంటే రాష్ట్రాల్లో పటిష్ట నాయకత్వం ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానం అస్సలు సమ్మతించదు. మొత్తం తమ గుప్పెట్లోనే ఉండాలని భావిస్తుంది. పోనీ అధిష్టానమైన బలంగా ఉందా అంటే, వారికి దేశ వ్యాప్తంగా ప్రజామోదం క్షీణిస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం మేల్కోక పోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం.

Leave a Reply