వీళ్ళందరూ కలిసి సృష్టించిన మృగమే నయీం

మనదేశంలో రాజకీయానికి రౌడీయిజానికి మధ్య అవినాభావ సంబంధం,అక్రమ సంబంధం ఉంది. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగానే, రౌడీ ముదిరి రాజకీయ నేత అవుతున్నాడు. రాజకీయ నాయకుల అండ లేకుండా రౌడీయిజం ఉండగలదా..? రాజకీయం తలచుకుంటే క్షణాల్లో రౌడీయిజాన్ని నాశనం చేయగలదు. అలాగే రాజకీయం తలచుకుంటే దశాబ్దాలపాటు రౌడీయిజాన్ని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని జో కొడుతూ ఉంటుంది. ఇటివలి కాలంలో అందరి నోళ్ళల్లో నానుతుతున్న నయీం ఉదంతమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. నయీం. ఈ పేరు కొత్తగా ఏమన్నా వింటున్నామా..ఎప్పుడొ ఒకసారి లోకం మునిగిపోయే పెద్ద సంఘటనకు తప్ప మిగతా విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిలేనివారికి నయీం పేరు కొత్తేమోగానీ ప్రతి రోజూ పత్రికలు చదివేవారికి, టీవీల్లో వార్తలు చూసేవారికి నయీం పేరు సుపరిచితమే. ఎందుకంటే నయీం ఓ కరుడుగట్టిన రౌడీ, ఉన్మాది, మాజీ తీవ్రవాది. అతను చేసిన దారుణాలు ఒకటి కాదు,రెండు కాదు, దావూద్ ఇబ్రహీం లాగా నయీం పెద్ద డాన్ లా ఎదుగుతున్నాడనే విషయం అతని చరిత్ర తెలిసిన చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు. మరి ఇన్ని రోజులు ఇతన్ని పెంచి పోషించిన పెద్దలు ఇప్పుడు అతనిపై ఎందుకు అటాక్ చేశారు. ఎందుకంటే ఆ  పెద్దల్నే కబళించేందుకు ఈ మృగం సిధ్ధమయింది కాబట్టి. తన దాకా వస్తే గానీ తెలియలేదు.తన కిందకు నీళ్ళొస్తే గానీ తెలియలేదు. ఇన్ని రోజులు నష్టపోతోంది, బాధపడుతుంది, దాడులకు గురవుతుంది తాము కాదు కనుక ఈ రాజకీయ నాయకులు అందరూ ఈ మృగాన్ని సమాజం మీదకు విడిచిపెట్టి వినోదం చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు నయీం అకృత్యాలు బయటపెడుతున్నారు. ఇప్పుడు సామాన్య జనానికి అర్ధంకాని విషయం ఏమిటంటే నయీం లాంటి మృగాన్ని మట్టుపెట్టి అతని చీకటి సామ్రాజ్యాన్ని కూల్చివేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలా? లేక ఈ రెండేళ్ళపాటు ఏమీ చేయకపోయినందుకు నిందించాలా అనే విషయమే. ఇప్పటిదాకా నయీం  అకృత్యాలకు అడ్డుకట్ట వేయలేని ప్రభుత్వం, ఇప్పుడు తన ప్రభుత్వంలోని పెద్దలకే రక్షణ కోల్పోయిన తరువాత తప్పని పరిస్థితిలో నయీం ఆగడాలకు తెర దించిందనే విషయం  సుస్పష్టం. ఇప్పుడు అతనికి చెందిన వారి ఇళ్ళల్లో తనిఖీలు చేసి మారణాయుధాలు, వేల కోట్లడబ్బు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంటున్న పోలీసులను చూసి చప్పట్లు కొట్టాలో, కళ్ళముందు నగరాల్లో, పట్టణాల్లో ఇంత అరాచకం దాగి ఉన్నా ఇప్పటిదాకా కళ్ళు మూసుకును ఉన్నందుకు ఛీ కొట్టాలో అర్ధం కావట్లేదు. నయీం డైరీలో ఎందరో రాజకీయ నాయకులు, ఐపీఎస్ అధికారులు, మీడియా ప్రతినిధుల జాతకాలు దాగి ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకూ వాస్తవమో తెలియదు కానీ నయీం అరాచకాల్లో ఈ మూడు శక్తుల పాత్ర, ప్రోత్సాహం ఉందనేది మాత్రం నూటికి నూరుపాళ్ళ నిజం.. ఇప్పటికైనా ప్రభుత్వం నిజాయితీగా నయీం గ్యాంగ్ అరాచకాలకు ఊతమిచ్చిన రాజకీయనాయకులు, ఐపీఎస్ అధికారులు, మీడియా ప్రతినిధులు, ఛోటా మోటా నాయకులు, ఉద్యోగులు, లీడర్లు. వీళ్ళ బండారాన్నంతా బయటపెట్టాల్సిన అవసరం ఉంది. తనవారిని రక్షించుకుని ఇతరులపై బురద చల్లటమో, లేక ఈ డైరీ అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ది పోందాలనుకునే ప్రయత్నాలను గనుక ప్రభుత్వం చేస్తే ఈ ఎపిసోడ్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ప్రజల చేతిలో ప్రభుత్వానికి పరాభవం తప్పదు.ఎందుకంటే ఇప్పటికే నయీం ఎపిసోడ్ లో ప్రభుత్వానికి మైనస్ మార్కులే ఇప్పటివరకూ ఎక్కువపడ్డాయి.

Leave a Reply