కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం

కేంద్రంలోని భాజాపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత డిసెంబర్ నుండి రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నఈశాన్య సరిహద్దు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ మార్పుకు సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారి చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్దరించాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. గత డిసెంబర్ లో కాంగ్రెస్ తిరుగుబాటు నేత కలిఖో పుల్ నేతృత్వంలో 21 శాసనసభ్యులు ముఖ్యమంత్రి నబం తుకిపై తిరుగుబాటు చేయడంతో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దాంతో గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాష్ట్రపతి పాలన విధించారు. అనంతరం జరిగిన పరిణామాలతో కలిఖో పుల్, భాజాపా శాసనసభ్యుల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ సుప్రీమ్ కోర్ట్ ను ఆశ్రయించింది. కాంగ్రెస్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ ఈ రోజు తీర్పును వెలువరించింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్దరించాలని సుప్రీం కోర్ట్ ఆదేశించింది, అదే విధంగా గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు అన్నింటిని రద్దు చేసింది. సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ నేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే నబం తుకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు.

Leave a Reply