కట్టుబట్టలతో రాష్ట్రాన్ని నడి రోడ్డుపై నిలబెట్టారు..

ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని సీ ఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జరిగిన చర్చ పై చంద్రబాబు కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు. రాజకీయ కుట్రలతో, రాజకీయ లబ్ది కొరకు రాష్ట్ర విభజన చేశారని, ఆంద్ర ప్రదేశ్ ప్రజలు కలలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఊహించలేదని చంద్రబాబు తెలిపారు. పార్లమెంట్ లో రాజ్యాంగ విధానానికి విరుద్దంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పాస్ చేయించి కట్టుబట్టలతో రాష్ట్రాన్ని నడి రోడ్డుపై నిలబెట్టారు అని విమర్శించారు. విభజన సమస్యలపై తాను పోరాడానని, ఎనిమిది రోజులు ఢిల్లీలో దీక్ష చేసి, విభజన సమస్యలపై ఎనిమిది పేపర్లు పబ్లిష్ చేశానని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ రోజు తాను విభజన సమస్యల గురుంచి మాట్లాడుతుంటే వైకాపా అధినేత జగన్ మాత్రం సమైక్యాంధ్ర అంటూ ప్రజలను విభజన సమస్యల నుండి పక్క దారి పట్టించాడని విమర్శించారు. ఆంధ్రులు 60 ఏళ్ళుగా హైదరాబాద్ లో పెట్టిన పెట్టుబడులు రావు, రాజధాని ఉండదు, భవిష్యత్ తరాలు ఇబ్బందుల్లో పడతాయని తెలిసి ప్రజలను పాజిటివిటి వైపు మళ్ళించడానికి చాలా కష్ట పడ్డాను అని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.

Leave a Reply