రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు…

దాయాది దేశాలైన భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా భారత్-పాక్ మధ్య రగులుతున్న సమస్య ఇప్పుడు తీవ్ర రూపం దాల్చినట్లే కనపడుతుంది. కాశ్మీర్ పై నోరు పారేసుకుంటున్న పాకిస్తాన్ పై తాడో పేడో తేల్చుకునేందుకు భారత్ సిద్దం అయినట్లే కనిపిస్తుంది. బుర్హాన్ ఎన్ కౌంటర్ తర్వాత కాశ్మీర్ లోయలో పాకిస్తాన్ దూకుడు పెంచింది. ఒక వైపు కాశ్మీర్ లో యువకులను రెచ్చగొడుతూనే, మరివైపు ఉగ్రవాదులను సరిహద్దు దాటిస్తుంది.పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ బహిరంగ సభలో మాట్లాడుతూ కాశ్మీర్ పాక్ లో కలిసే రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. అలాగే బుర్హాన్ ఎన్ కౌంటర్ జరిగిన రోజును బ్లాక్ డే గా పాటించనున్నట్లు షరీఫ్ తెలిపారు. కాశ్మీర్ లో జరుగుతున్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమీషన్ కు పిర్యాదు చేస్తామని ప్రకటించారు. అయితే షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మందిపడ్డది. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే హక్కు పాకిస్తాన్ కు లేదని ప్రకటించింది. అందుకు హెచ్చరికగా పాకిస్తాన్ లో భారత హై కమీషనర్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు వెంటనే తమ పిల్లలను భారత దేశానికి పంపించి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా దేశంతో తీవ్ర పరిణామాలు ఎదురైనప్పుడే కేంద్రం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే ఇప్పుడు భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లే కనబడుతుంది. రాజస్థాన్, కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో సరిహాద్దు గ్రామాల్లోని ప్రజలను ఇప్పటికే అనధికారికంగా గ్రామాల నుండి తరలిస్తున్నారు.

Leave a Reply