కేంద్రంతో తెలంగాణ రాష్ట్ర బంధం బాగుంది.

ప్రధాని నరేంద్రమోడీ గజ్వేల్ పర్యటన ముగిసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు.రిమోట్ సాయంతో వరంగల్ లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీని, రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ ను, మనోహరాబాద్ రైల్వే లైన్ ను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మోడీ తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమని, దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధి వేగంగా జరిగుతున్న రాష్ట్రం అని మోడీ తెలిపారు. తెలంగాణలో విద్యుత్ కొరత ఇప్పుడు లేదని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల వల్ల కేవలం రూపాయి 6 పైసలకే యూనిట్ విద్యుత్ లభిస్తుందని మోడీ పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతగానో ఉందని, అందుకోసం రాష్ట్రాలకు విరివిగా యురియాను అందిస్తున్నామని, గత రెండేళ్ళుగా ఏ ఒక్క రాష్ట్రం కూడా ఏ రాష్ట్రం కూడా యూరియా కావాలని అడగలేదని తెలిపారు. అలాగే దేశంలో ఆవులను రక్షించాల్సిన అవసరం ఎంతగానో ఉందని మోడీ అభిప్రాయపడ్డారు. కొంతమంది గో రక్షా దళ్ పేరుతో దాడులకు దిగుతున్నారని, అటువంటి వారంతా నకిలీ గో రక్షా దళ్ కార్యకర్తలని, అటువంటి వారిని రాష్ట్రాలే అదుపులో పెట్టుకోవాలని నరేంద్ర మోడీ సూచించారు. దేశంలోని అన్ని సమస్యలకు అభివృద్ధి ఒక్కటే పరిష్కారం అని, రాష్ట్రాలు అభివృద్ధిలో పోటి పడాలని అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని మోడీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ ఎంత దూరమో ఢిల్లీ కుడా అంతే దూరమని పేర్కొన్నారు.

Leave a Reply