ఇక తెరాసతో బీజేపీ ప్రత్యక్ష యుద్దమే..

ఈ నెల 7వ తేదిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించబోతున్న విషయం తెలిసిందే. ఆ రోజు ఆయన పలు బహిరంగ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం మోదీ హైదరాబాద్ లో జరిగే భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు అధికార తెరాసకు బీజేపీ వ్యతిరేకంగా వ్యవహరించిన సందర్భాలు చాలా తక్కువ. గతంలో కేంద్ర ప్రభుత్వంలో తెరాస చేరబోతుందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు తెరాసపై బీజేపీ ప్రత్యక్ష యుద్దానికి దిగుతుందంటూ ప్రకటించారు బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి. తెరాస ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై మోడీ సభలో శంఖారావం పూరిస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. తెరాస పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని, అందుకు ఎంసెట్-2 పేపర్ లీక్ అవ్వడం, యూనివర్సిటీల వీసీల నియామకం నిదర్శనం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి తూట్లు పొడిచిన వారిని అక్కున చేర్చుకొని అందలం ఎక్కించారని కిషన్ రెడ్డి విమర్శించారు. తెరాసకు ప్రత్నామ్యాయ శక్తిగా తెలంగాణలో ఎదగడమే తమ లక్ష్యం అని కిషన్ రెడ్డి తెలిపారు.

Leave a Reply