ప్రతిపాదనలు సిద్ధం చేయనున్న మంత్రి హరీష్ రావు

ఎస్.ఆర్.ఎస్.పి లో నీటి మట్టం 47.5 టీఎంసీలకు చేరుకోవడంతో పాటు ఇన్ ఫ్లో కూడా ఎనిమిది వేల క్యూసెక్కులకు పైగా ఉన్నందున దిగువన ఉన్న ఆయకట్టుకు నీరు విడుదల చేసే ప్రతిపాదనలు, ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్  అధికారులను ఆదేశించారు. ఇటు ఎస్.ఆర్.ఎస్.పి, అటు శ్రీశైలం డ్యామ్ లలో నీరు వచ్చి చేరుతుండడంతో తెలంగాణ ప్రజలు, రైతులు, భక్తుల అవసరాల మేరకు ఆ నీటిని వాడుకునే అంశంపై ముఖ్యమంత్రి మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఎగువ నుంచి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం ఎస్.ఆర్.ఎస్.పికి వస్తున్నందున దిగువకు ఎంత మేరకు నీటి విడుదల చేయడం సాధ్యమవుతుందో అంచనా వేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు, నీటి పారుదల శాఖ ఇ.ఎన్.సి మురళీధర్ రావులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని, దానికి సరిపడా నీటిని నిల్వ ఉంచుకుంటూనే ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆయకట్టుకు నీరందించాలని సిఎం స్పష్టం చేశారు. ఎంత ఆయకట్టుకు నీరందించవచ్చు? ఎక్కడి వరకు నీరు చేరుతుంది? ఎంత పరిణామంలో నీటి విడుదల చేయవచ్చు? తదితర అంశాలతో రెండు రోజుల్లో ప్రతిపాదనలు తయారు చేయాలని సిఎం ఆదేశించారు. ఎస్.ఆర్.ఎస్.పికి వచ్చే ఇన్ ఫ్లో ఆధారంగా ఔట్ ఫ్లోను నిర్ధారించాలని చెప్పారు. వరంగల్, నల్గొండ జిల్లాల రైతుల నుంచి చెరువులు నింపాలనే డిమాండ్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. రెండు జిల్లాల్లో చెరువులు నింపడానికి రెండున్నర, మూడు టీఎంసీల నీరు అవసరం పడుతుందని, ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులకు సానుకూలంగా వ్యవహరించాలని చెప్పారు. ఆయకట్టుకు, చెరువులకు నీరందించే విషయంలో ప్రతిపాదనలు సిద్దం కాగానే నీటి విడుదలపై తుది నిర్ణయం తీసుకుంటామని సిఎం వెల్లడించారు. రెండు రోజుల్లోనే నీటి విడుదల చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

Leave a Reply