వేలాడుతున్న ఉద్వాసన కత్తి…

తెలంగాణలో ఎంసెట్ 2 పేపర్ లీక్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుంది. సీఐడీ అధికారులు ప్రకటించిన అధికారిక వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన రాజగోపాల్ రెడ్డి బృందం 25 మంది విద్యార్థులను బెంగులురుకు తీసుకు వెళ్ళింది. అక్కడ విద్యార్థులతో నాలుగు సెట్లకు చెందిన రెండు సబ్జెక్టులలోని 320 ప్రశ్నలను వారితో సాధన చేయించారు. అందుకోసం ఒక్కో విధ్యార్థీ నుండి 30-40 లక్షలు తీసుకున్నారు. ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుండే ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు సీఐడీ అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటికే ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మరింత మంది విద్యార్థులను విచారించే అవకాశం ఉంది.

దీనిని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ మొత్తం తతంగం తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను గమనిస్తే ఆయన పాత్ర పై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం వ్యవహారాన్ని మరో మంత్రి లక్ష్మా రెడ్డి చూసుకుంటున్నారు. ఇంత కీలక మైన అంశంలో ఆ శాఖ మంత్రికి ప్రాధాన్యం ఇవ్వక పోవడాన్ని చూస్తే కడియం పై వేటు తప్పదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే గతంలో కడియం స్థానంలో డిప్యూటీ సీఎం గా పని చేసిన రాజయ్యను ఆయన శాఖలో జరిగిన చిన్న అవినీతికే ఆయనను ముఖ్యమంత్రి తప్పించారు. ఇప్పుడు విద్యా శాఖలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరగడంతో కడియం కు ఉద్వాసన తప్పదనే వార్తలు వస్తున్నాయి.

Leave a Reply