ఇస్రోతో ఒప్పందం… మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ..

తెలంగాణ ప్రభుత్వం మరో ఘనతను సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో జలాశయాల్లో, చెరువుల్లో,కుంటల్లో నీటి నిల్వలు సమీక్షించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సహాయం తీసుకోనుంది. తెలంగాణకు సహాయం చేసేందుకు ఇస్రో ముందుకు వచ్చింది. అందుకోసం అత్యాధునిక సాంకేతికతో కూడిన ఉపగ్రహాలను ఉపయోగించనున్నారు. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రత్యేకంగా తెలంగాణ కోసం జల వనరుల విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. దీనిపై ఆగష్టు 6 నాడు తెలంగాణ ప్రభుత్వం తరపున ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ లు ఎంఓయు కుదుర్చుకుంటారు.ప్రతి 15 రోజులకు ఒక సారి తెలంగాణ ప్రభుత్వానికి జలాశయాల్లో, చెరువుల్లో, కుంటల్లో నీటి నిలువ గురుంచి నివేదిక ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇస్రో ప్రతినిధులు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుతో ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఈ వ్యవస్థను మెరుగ్గా నిర్వహించేలా రాష్ట్రంలోని ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని ఇస్రోను కోరారు. అలాగే సర్వే నెంబర్ల వారిగా రాష్ట్రంలోని ఆయకట్టు వివరాలను నమోదు చేయాలని, డ్యాంలు, కాలువలు, చెరువులను ఉపగ్రహాల సాయంతో మార్క్ చేయాలని మంత్రి హరీష్ రావు కోరారు. కాగా జలవనరుల వినియోగం కోసం ఉప గ్రహాలను ఉపయోగించుకోబోతున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కబోతుంది.

Leave a Reply