జీ ఎస్ టీ బిల్లు ఆమోదం పొందడం ఇక లాంఛనమే..

దేశమంతా ఒకే రకమైన టాక్స్ ఉండాలన్న ఉద్దేశంతో 10 సంవత్సరాల క్రితం యూపీఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీ ఎస్ టీ బిల్లు అన్ని అవాంతరాలు దాటుకొని ఆఖరి దశకు చేరుకుంది. ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు ఇక రాజ్యసభలో కూడా ఆమోదం పొందడం ఇక లాంఛనమే. రాజ్యసభలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన నాలుగు సవరణలకు అధికార బీజేపీ అంగీకారం తెలపడంతో బిల్లు ఆమోదం పొందేందుకు మార్గం సుగమం అయ్యింది.

అయితే దేశ ప్రజల్లో బిల్లు ఆమోదం పొందడం వల్ల వచ్చే లాభం ఏమిటి? నష్టం ఏమిటి? అనే ప్రశ్నలు మొలుస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక వస్తువుపై కాని, సేవ పై కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాలైన పన్నులు విధించేవి. రాష్ట్రాలు విధించే పన్నులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా ఉంటాయి. అందువల్ల ఒకే వస్తువు వివిధ రాష్ట్రాల్లో వేరే వేరే ధరలకు లభించేది. అయితే జీ ఎస్ టీ బిల్లు గనుక అమలులోకి వస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రమే పన్నులు విధించగలదు. రాష్ట్రాలు విధించే పన్నులన్నీ అందులోనే విలీనం అవుతాయి. కనుక ఇక రాష్ట్రాలు స్వతంత్రంగా పన్నులు విధించే అవకాశం ఉండదు. అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పిన సవరణ ప్రకారం ఎక్సైజ్ టాక్స్ లు మాత్రం రాష్ట్రాల అధీనంలోనే ఉంటాయి.

ప్రస్తుతం వస్తువులపై పన్ను 24-26 శాతంగా ఉంది. అలాగే సేవలపై 12-15 శాతంగా ఉంది. జీ ఎస్ టీ బిల్లు గనుక ఆమోదం పొందితే వస్తువులపై, సేవలపై 17-18 శాతం వరకు టాక్స్ ఉంటుంది. దాని ప్రకారం వస్తువుల ధరలు తగ్గుతాయి, సేవలపై ధరలు పెరుగుతాయి.

▲▲▲ధరలు పెరిగేవి▲▲▲

 • హోటల్స్, రెస్టారెంట్లు మరింత ఖరీడైనవిగా మారుతాయి.
 • మొబైల్ ఫోన్ చార్జీలు పెరుగుతాయి.
 • రైల్వే, బస్సు, ఎయిర్ లైన్స్ టికెట్ల రెట్లు పెరుగుతాయి.
 • కరెంటు బిల్లులు పెరుగుతాయి.
 • మద్యం, సిగరెట్ల ధరలు పెరుగుతాయి.
 • హాస్పిటల్ చార్జీలు పెరుగుతాయి.
 • కమర్షియల్ వాహనాల ధరలు పెరుగుతాయి.
 • బట్టల ధరలు పెరుగుతాయి.
 • బ్రాండెడ్ నగలు, ఆభరణాల ధరలు పెరుగుతాయి.
 • లగ్జరీ కార్ల ధరలు పెరుగుతాయి.
 • మొబైల్ ఫోన్ ల ధరలు తగ్గుతాయి.

▼▼▼ధరలు తగ్గేవి▼▼▼

 • చిన్న కార్ల ధరలు తగ్గుతాయి
 • మోటారు వాహనాల ధరలు తగ్గుతాయి.
 • ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాల ధరలు తగ్గుతాయి.
 • కారు బ్యాటరీ ధరలు తగ్గుతాయి.
 • పెయింట్స్, సిమెంట్ ధరలు తగ్గుతాయి.
 • సినిమా టికెట్స్ తగ్గుతాయి.

జీ ఎస్ టీ బిల్లు గనుక ఆమోదం పొందితే జీడీపీ 2 శాతం పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే అవినీతి కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత అమలు చేయకపోతే పెద్దగా ఉపయోగం ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మోదీ ప్రభుత్వం ఆశితున్నట్లుగా ఈ బిల్లు ఆమోదం పొందితే వెంటనే దేశ రూపురేఖలు మారిపోతుందా అంటే కాలమే సమాధానం చెప్పాలి.

Leave a Reply