కీలకంగా మారిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్..

[pullquote]ఆయన శాఖకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆయనే చూసుకోవాలి అన్న విధంగా మిగిలిన నేతలు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించేదే.. [/pullquote]తెలంగాణ రాష్ట్ర సమితిలో ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం పార్టీలో ఒంటరి వారయ్యారా అంటే అవుననే అనిపిస్తున్నాయి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే. ఆయనకు ఇప్పుడు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఇబ్బందులు తప్పడం లేదు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పై గత కొన్ని రోజులుగా తెలంగాణలో ప్రతిపక్షాలతో పాటు భూ నిర్వాసితులు కూడా ఆందోళనలు చేస్తున్నారు. అందరికి సమాధానం ఇస్తూ హరీష్ రావు ముందుకు పోతున్నా, పార్టీ లోని మిగిలిన నేతల నుండి ఆయనకు మద్దతు లభించడం లేదు. ఆయన శాఖకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆయనే చూసుకోవాలి అన్న విధంగా మిగిలిన నేతలు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించేదే. ప్రభుత్వం పై ఏ చిన్న విమర్శ వచ్చినా ఎదురుదాడి చేసే తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు మల్లన్న సాగర్ విషయంలో సైలెంట్ గా ఉండడం హరీష్ రావు వర్గీయుల్లో కొత్త అనుమానాలు రేకేత్తుస్తున్నాయి. హరీష్ రావుకు మద్దతుగా నిలబడితే పార్టీలోని కొందరు కీలక నేతలు దృష్టిలో తమ వర్గం కాదనే ముద్ర పడుతుందనే భయంతో మిగతా మంత్రులు ఉన్నట్లు తెలుస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై అటు డిల్లీ నుండి ఇటు గళ్లీ వరకు మల్లన్న సాగర్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కి మరీ అడ్డుకుంటూ ఉంటే, ముంపు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న తరుణంలో మంత్రి హరీష్ రావు కీలకంగా మారారు. తన సొంత శాఖ కావడం, అటు ప్రాజెక్టు నిర్మాణం తన నియోజకవర్గానికి సంబంధించినది కావడంతో పూర్తి బాధ్యత తనే తీసుకున్నారు.అయితే ఈ విషయంపై ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడంలో ఇతర మంత్రులు అంతగా చొరవ తీసుకుంటున్నట్లు అనిపించట్లేదు. అందుకే ఎదో చేశాం అంటే చేసాం అన్నట్లు అప్పుడప్పుడు పలు విమర్శలు గుప్పిస్తూ ప్రభుత్వంలోనే తాము ఉన్నామనే విధంగా మిగతా మంత్రులు ప్రవర్తిస్తున్నట్లు ఉండటం చర్చలకు దారితీస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ విషయంలో హరీష్ కు మద్దతుగా నిలవడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మల్లన్న సాగర్ పై ఆందోళనలు జరుగుతున్న కొత్తలో ధర్నా చేస్తున్న వారిపై లాఠీ చార్జ్ కు ఆదేశాలు ఇవ్వమని కేసీఆర్ ను కోరితే ఆయన ముందు నీ శాఖ చూసుకో అని హరీష్ రావుకు సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. తర్వత ఆందోళనలు తీవ్ర రూపం దాల్చినప్పుడు లాఠీఛార్జికి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడంతో పరిస్థితి చేయి దాటడంతో హరీష్ రావు తీవ్ర నిరాశలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా మరో యువనేతకు లైన్ క్లియర్ చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. మల్లన్న సాగర్ విషయంలో హరీష్ రావు విఫలమయ్యారు అని చూపించి యువనేతను ప్రమోట్ చేసేవిధంగా ముఖ్యమంత్రి వ్యూహాలు రచిస్తున్నట్లు హరీష్ వర్గం నేతలు భావిస్తున్నారు.

తాజాగా జరుగుతున్న పరిణామాలు హరీష్ రావు కు అగ్ని పరీక్షలా మారాయి. ఆయన వీటి నుండి బయట పడతారో లేదో కాలమే నిర్ణయించాలి.

Leave a Reply