మూసీ ఉప్పొంగితే నగరం తట్టుకుంటుందా..?

నాలుగు శతాబ్ధాల చరిత్ర కలిగిన పురాతన నగరం, ఎప్పటి కప్పుడు కొత్త రూపును సంతరించుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తూన్న నగరం అని చెప్పుకునే మన హైదరాబాద్ నగరం ఈ రోజు కురిసిన 6 సెంటీ మీటర్ల వర్షానికే విల విల్లాడి పొయింది. అయితే దాదాపు 108 సంవత్సరాలకు పూర్వం కురిసిన వర్షం గనుక ఇప్పుడు కురిస్తే నగరం ఏమవుతుందో? 1908 సెప్టెంబర్ 27 హైదరాబాద్ చరిత్రలో చీకటి రోజు. రాత్రి అందరు ఘాడ నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి 2 గంటలకు చిన్నగా మొదలైన వర్షం ఉదయం 6 గంటలయ్యే సమయానికి ఉగ్రరూపం దాల్చింది. 36 గంటలు ఏకధాటిగా కురిసిన వర్షానికి 80000 ఇండ్లు నేల మట్టం అయ్యాయి. 25 శాతం నగర ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. మూసీ నది 60 అడుగుల మేర ప్రవహించి తీర ప్రాంతాలను కల్లోలం చేసింది. నిజాం హాస్పిటల్ అందులో ఉన్న రోగులతో సహా తుడిచిపెట్టుకు పొయింది. ఉస్మానియా హాస్పిటల్ ఆవరణలో ఉన్న 400 సంవత్సరాల చింతచెట్టు ఎక్కి 150 మంది తమ ప్రాణాలను కాపాడుకున్నారు. మొత్తంగా 36 గంటలు కురిసిన వర్ష పాతం  17 ఇంచులు(43 సెంటీమీటర్లు)గా నమోదయింది. పరిస్థితి గమనించిన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భవిష్యత్తులో ఇటువంటి వరదలు వస్తే ఏం చేయాలి అనే దానిపై సయ్యద్ అజాం హుస్సేనీ అధ్యక్షతన అక్టోబర్ 1న కమిటీ వేశారు. సరిగ్గా సంవత్సరం తర్వాత అక్టోబర్ 1, 1909  కమిటీ తన నివేదికను అందించింది. అందుకు అనుగుణంగా నిజాం, ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అధ్వర్యంలో మూసీ నది ఎగువన నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉస్మాన్ సాగర్(గండిపేట చెరువు) ఆనకట్ట నిర్మించారు. అలాగే మూసీ ఉపనది, ఈసీపై నగరానికి 10 కిలో మీటర్ల దూరంలో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిర్మించారు. అప్పుడు నిర్మించిన జలాశయాలు ఇప్పటికి నగర వాసుల దాహార్తీని తీరుస్తుడడం గమనార్హం. అప్పటికి ఇప్పటికి నగరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు 700అడుగుల వెడల్పు ప్రవాహంతో మహా నదిగా ప్రవహించిన మూసీ ఇప్పుడు మురికి కాలువగా మారింది. మూసీ ప్రవాహ ప్రాంతం కబ్జాలకు గురి అయింది.

నదులు తమ ప్రవాహ ప్రాంతాన్ని ఎప్పటికి మార్చుకోవు. కొన్ని వందల సంవత్సరాలుగా మనుగడలో లేకున్నా, ఒక్క సారిగా నీరు వస్తే తిరిగి అదే ప్రవాహ ప్రాంతంలో ప్రవహిస్తాయి. అందుకు పెద్ద ఉదాహరణ చెన్నై. 130 సంవత్సరాల క్రితం అదృశ్యమైన అడయార్ నది ప్రవాహ ప్రాంతంలో చెన్నై ఎయిర్ పోర్టును నిర్మించారు. ఒక్క సారిగా నదిలోకి నీరు రాగానే చెన్నై ఎయిర్ పోర్టును ముంచెత్తింది. అదే పరిస్థితి మూసీ నదికి వస్తే? ఊహించడానికే భయంకరమైన పరిస్థితి నగరానికి వస్తుంది. ఇప్పటికైనా మన పాలకులు సత్వర చర్యలు కాకుండా శాశ్వత చర్యలు చేపట్టి భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలు, ఆపదలు తట్టుకునే విధంగా నగరాన్ని తీర్చిదిద్దుతారని ఆశిద్దాం.

Leave a Reply