అనూహ్యంగా రజతం అందుకోబోతున్న భారత రెజ్లర్..

రియో ఒలింపిక్స్ ముగిశాయి. భారత అమ్మాయిలు సాక్షి మాలిక్ కాంస్యంతో, పీవీ సింధు రజత పతకాలతో మెరిశారు. అయితే ఇప్పుడు భారత్ ఖాతాలో మరో ఒలింపిక్ రజత పతకం వచ్చి చేరబోతుంది. అయితే అది రియో ఒలింపిక్స్ కు సంబంధించినది కాదు. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్ కు సంబంధించినది. ఆ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో60 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన యోగేశ్వర్ దత్ ఇప్పడు అనూహ్య పరిస్థితుల్లో రజత పతకం అందుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. లండన్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో రజత పతకం సాధించిన రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ డోపింగ్ పరీక్షలో విఫలం చెందడంతో అతను సాధించిన రజత పతాకాన్ని ఇప్పుడు యోగేశ్వర్ దత్ అందుకోబోతున్నారు. రియో ఒలింపిక్స్ ముందు పలువురు రష్యా అథ్లెట్లు డోపింగ్ లో దొరికి పోవడంతో, లండన్ ఒలింపిక్స్ సమయంలో సేకరించిన శాంపిల్స్ ను అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో పరిశీలించారు. అందులో బేసిక్ కుదుఖోవ్ డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడయింది. అయితే బేసిక్ కుదుఖోవ్ 2013లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు.రజతం ఖాయం చేసుకున్న యోగేశ్వర్ దత్ అదే ఒలింపిక్స్ లో రజత పథకం అందుకున్న సుశీల్ కుమార్ సరసన నిలిచారు.

Leave a Reply