బంగారు తెలంగాణ ఆయనతోనే సాధ్యం..

మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నారు. జిల్లాలోని ధరూర్ మండలం రేలంపాడు దగ్గర నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం రెండో లిఫ్టును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కృష్ణా నీటిలో మొదటి హక్కుదారులు పాలమూరు జిల్లా వాసులేనని పేర్కొన్నారు. ఈ లిఫ్టు ద్వారా ఆలంపూర్, గద్వాల్ నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. కేసీఆర్ నాడు నడిగడ్డ నుండి నీటికోసం పాదయాత్ర చేసి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని నాడు తెలంగాణ వస్తే పాలమూరును సస్యశ్యామలం చేస్తామని అన్నారని, ఆయన అన్నట్లుగానే ఇప్పుడు పాలమూరుకు పవిత్ర కృష్ణా జలాలను తీసుకు వచ్చారని హరీష్ రావు పేర్కొన్నారు.  సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు పాలకులపై ఒత్తిడి చేయక పోవటం వల్లే పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి కాలేదు అని, అదే ఆంధ్రలో మాత్రం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నారు అని విమర్శించారు. గత ప్రభుత్వాలు మూడు వేల ఎకరాలకే నీరు అందించారని, తమ ప్రభుత్వం మాత్రం రెండేళ్ళలోనే 4.5 లక్షల ఎకరాలకు నీరందించామని హరీష్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం ఎంతగానో కష్ట పడుతున్నారు అని, తెలంగాణ తెచ్చింది కేసీఆరే అని, బంగారు తెలంగాణ కూడా కేసీఆర్ తోనే సాధ్యం అని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్లానింగ్ కమీషన్ వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, మంత్రులు లక్ష్మా రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్ మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జడ్పీ చైర్మన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply